కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను తప్పకుండా గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన చీఫ్​గెస్ట్ గా హజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా సయ్యద్ ఫసిఉల్లాతో పాటు పది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు మార్కెట్ కమిటీ అధికారులను సమన్వయం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండి వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పదవులు రానివారు ఎవరూ నిరాశ పడవద్దని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ షాబొద్దిన్, సెక్రటరీ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, పొనకల్ సహకార సంఘం చైర్మన్ అల్లం రవి, పార్టీ నాయకులు రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, మోహన్ రెడ్డి, మాణిక్యం, రాయమల్లు గౌడ్, గంగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

రాఘవేంద్ర గ్రూప్స్, మెడిలైఫ్ హాస్పిటల్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. మండల కేంద్రంలోని సినిమా హాల్ లో నిర్వహించిన మెగా వైద్య శిబి రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మండల ప్రెసిడెంట్లు మధుసూధన్ రావు, ముజాఫర్ ఆలీఖాన్, లక్సెట్టిపేట బార్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్, మెడిలైప్ హస్పిటల్ కు చెందిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.